Thursday, September 17, 2009



    
ఒక వ్యక్తి తన బంధువర్గంలోని మరొకరిని అణగదొక్కడానికి, తన అదుపులో ఉంచుకోవడానికి తన శక్తిని దుర్విని యోగ పరచడాన్ని గృహ హింసగా పరిగణిస్తారు. శారీరక హింస, లైంగిక దాడి, లైంగిక వేధింపులు భయపెట్టడం, మానసికంగా కించపరచడం, అవమాన పరచడం, ఎదుటి వారిని పనికిరానివారిగా, నిరుపయోగమైన వారిగా భావించేలా చేయడం, వారి వద్ద ధనం లేకుండా చేయడం, ఇంటి నుంచి బయటకు వెళ్ళకుండా చేయడం, నిర్భం ధించడం, సామాజికంగా వారిని ఒంటరిని చేయడం, భ్రూణ హత్యలు, వరకట్న వేధింపులు, వరకట్న హత్యల వంటివన్నీ గృహహింసలో భాగమే. ఇవిమాత్రమే కాదు, యజమానిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం కూడా గృహహింస పరిధిలోకే వస్తుంది.

సాధారణంగా గృహాల్లో గృహిణులు, పురుషులు ఇరువురూ వివిధ రీతులో్ల గృహహింస బారిన పడుతున్నా, ఈ పురుషాధిక్య సమాజంలో మహిళలే ఎక్కువగా గృహహింస బాధితులవుతున్నారు. ఒక ఇంటి వాతావరణంలోకి గృహహింస ఏదో ఒక రూపంలో ప్రవేశించిందంటే ఆ ఇంటిలోని పిల్లలు కూడా బాధితుల జాబితాలోకి చేరుతున్నారు. పిల్లలు నిరాదరణకు గురవడం, దెబ్బలు, తిట్ల బారిన పడడం వంటివి ఎదుగుతున్న పిల్లల జీవితా లకు పెనుశాపాలౌతాయి. గృహహింసకు ప్రత్యక్ష ప్రేక్షకులైన పిల్లలు మానసికంగా దెబ్బతినడం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, పిరికివాళ్ళుగా, కోపధారుగా తయారవడం, ప్రతి విషయంలోనూ న్యూనతకు గురవడం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే పిల్లలు యజమాని (సాధారణంగా తండ్రిని)ని అనుకరించడానికి ప్రయత్నించడం జరుగుతుంది.
గతంలో గృహహింసకు వ్యతిరేకంగా పోరాడే న్యాయ పరిరక్షణ బృందాలు, నేరపరిశోధక విభాగాలు, సామాజిక సేవా సంస్థల మధ్య పరస్పర అవగాహన ఎంతో సంక్లిష్టంగా వుండేది. అయితే గడచిన రెండు దశాబ్దాలుగా వారి చర్యలను
సమర్ధవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో గణనీయమైన వృద్ధిని సాధించారు. గతంలో గృహహింస కేసుల్లో విచా రణ సంప్రదాయబద్ధంగా వుండేది. విచారణలో గోప్యతకు ప్రాధాన్యత ఇచ్చేవారు. పోలీసు అధికారులు, ప్రభుత్వం, ఇతర సాంఘిక సేవా సంస్థలు కుటుంబ వ్యవహారాల్లో జోక్యానికి అయిష్టత చూపారనే చెప్పాలి. తమ వద్దకు వచ్చిన కేసులు క్రిమినల్ కేసులు పెట్టదగిన స్థాయిలో వున్నా, కౌన్సిలింగ్ నిర్వహించి పంపించేవారు. అయితే ఈ మధ్య కాలంలో రక్షణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఫెమినిస్టు గ్రూపులు చేస్తున్న పోరాటాలు బాధితులకు సత్వర న్యాయాన్ని అందించడంలోనూ, గృహహింసను ఎత్తి చూపడంలోనూ గణనీయమైన ప్రగతిని సాధించాయి. గృహహింస సమాజా నికి పట్టిన వ్యాధిలా భావిస్తున్న ప్రభుత్వాలు ప్రపంచ వ్యాప్తంగా వ్యాధి నిర్మూలనకు భారీ ప్రయత్నాలు చేస్తు న్నాయి. మానవజాతిలో తలెత్తిన ఈ వ్యాధిని నిర్మూలించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రభుత్వేతర, సామాజిక సంస్థలు తీవ్ర కృషి చేస్తున్నాయి. సున్నితమైన ఈ సమస్యను పరిష్కరించడానికి మరింత వాస్తవ దృక్పధంతో నడుం కట్టాయి. అమెరికా, బ్రిటన్, కెనడా, భారత్ లతో పాటు ప్రపంచంలోని పలు దేశాలు ఈ సమస్యపై దృష్టిపెట్టి పురోగతి సాధిస్తున్నాయి.
మన దేశ రాజధాని ఢిల్లీలో సాక్షి సంస్థ గృహహింస బాధిత మహిళలు, పిల్లలకు లైంగిక దాడి, లైంగిక వేధింపులు, చిన్న పిల్లలపై లైంగిక అత్యాచారాలు వంటి విషయాల్లో సాయం అందించడంతో పాటు, లైంగిక వేధింపులపై 1997లో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాల అమలుపై దృష్టి వుంచి పోరాడుతుండగా, వుమెన్స్ రైట్స్ ఇనిషియేటివ్ సంస్థ అధికార యంత్రాంగంతో కలసి గృహహింస బాధితులకు న్యాయ సాయాన్ని అందిస్తుంది. ఇక వాణిజ్య రాజధాని ముంబైలో మజ్లిస్, స్వాధర్ లాంటి సంస్థలు, చెన్నైలోని స్నేహ, బెంగుళూరులో విమోచన గృహహింస సంబంధిత విషయాలపై పోరాటాలు చేస్తున్నాయి. ఒక గృహహింస కేసులలోనే కాక, కౌన్సిలింగ్ నిర్వహణ, బాధితులకు విద్య అందించడం, ఉద్యోగ అవకాశాల కల్పన వంటి వాటిలో సైతం విశేష కృషి చేస్తున్నాయి. ఇక కోజికోడ్ లోని అన్వేషి సంస్థ మరో అడుగు ముందుకు వేసి బాధిత మహిళలకు మెడిటేషన్ సెంటర్, ఉపాధి కల్పన కేంద్రాలను నడుపుతోంది. కొల్కత్తాలోని సోషియో లీగల్ ఎయిడ్ అండ్ ట్రైనింగ్ సెంటర్, ప్రగతిషీల్ మహిళా మంచ్, స్వయం వంటి సంస్థలు కూడా తమ విశిష్ఠ సేవలను బాధితులకు అందిస్తున్నాయి.
గృహహింస పర్యవసానాలు సమాజం మీద భయంకరమైన సుదీర్ఘ దుష్ర్పభావాలను చూపుతాయి. ఆ ప్రభావాలను మనం ఒక గజం బద్దతో కొలవలేము. గృహహింస పర్యవసానం జీవితంలోని ప్రతి మలుపులో ఎదురవుతుంది. దీనిని మనం మానవ నేత్రంతో చూడలేము. గృహహింస ఒక వ్యక్తినే కాక వ్యవస్థను కూడా ఆర్ధికంగా నాశనం చేస్తుంది. దెబ్బతిన్న వ్యక్తి జీవితాన్ని రూపాయలతో కొలవలేము. కానీ ఆ వ్యక్తి చికిత్స కోసం చేసే ఆసుపత్రి ఖర్చులు ఒక కుటుంబ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తాయి. కుటుంబం అనే ఒక సూక్ష్మప్రపంచం సమాజానికి ఒక మొదలైతే, ఆ కుటుంబంలో ఏర్పడ్డ అలజడి రానున్న తరాలపై పడుతుంది. ఈ అలజడులు సముద్రపు అలల్లా కొన్ని తరాల వరకు ప్రవహిస్తూ సమాజాన్ని పీడిస్తూనే వుంటాయి. కొన్ని వేల గంటల సమయం, ఆరోగ్య సేవకులు, న్యాయ అధికారులు, కోర్టులు, సమాజ సేవకులు చేసే కోట్లాది రూపాయల ఖర్చు అన్నీ అనవస రమైనవే. గృహహింస వల్ల ఉద్యోగుల హాజరు కుంటుపడుతుంది. అందువల్ల ఉత్పత్తి సామర్ధ్యం తగ్గిపోతుంది. దీర్ఘకాలంలో అది ధేశ జిడిపిని దుబ్బతీస్తుంది. గృహహింసను నిర్మూలించడం వల్ల దేశ ప్రగతిలో గణనీయమైన పురోగతి కనిపిస్తుంది.
గృహహింస కుటుంబాలలోకి ప్రవేశించడానికి మొదటి కారణంగా వరకట్నాన్ని మనం పేర్కొనవచ్చు. అన్ని దేశాలలో దాదాపుగా అన్ని మతాలలో వివిధ రూపాల్లో, వివిధ ఆచారల్లో సమాజాన్ని పీడిస్తున్నది ఈ వరకట్న భూతం. వరకట్నం కోసం నవ వధువులు మంటల్లో మాడి మసి అవుతారు. ఆడపిల్లలు అమ్మ కడుపులో వుండగానే హత్య చేయబడతారు. ఈ పరిణామాలు ఇండియన్ పీనల్ కోడ్ 498 ఎ సెక్షన్ కు ఊపిరి పోశాయి. ఈ చట్టం కింద నేరస్తులను కఠినంగా శిక్షించవచ్చు. కొంతవరకు ఈ చట్టం మంచి ఫలితాలనే ఇచ్చిందని చెప్పాలి. దేశ వ్యాప్తంగా చట్టం చేస్తున్న కృషి, వివిధ సంఘాలు చేస్తున్న ఉద్యమాలు సమాజంలో వరకట్నానికి వ్యతిరేకంగా మంచి ఫలితాలను ఇస్తున్నాయి. అయితే మొదట ఉన్నత వర్గాల్లో మొదలైన ఈ వరకట్న ఆచారం ఆ తరువాత అన్ని వర్గాలకూ పాకి అది విశ్వవ్యాప్తమైంది. కఠిన చట్టాలు ఎన్ని వున్నా సమాజపు మూలాల్లో ప్రవేశించిన ఈ వరకట్న వేరు పురుగుకు మంచి మందు ఇంకా వెతకాల్సి వుంది.
 గృహహింస సాధారణంగా ఆ ఇంట్లోని పిల్లలపై విపరీత ప్రభావాన్ని చూపిస్తుంది. నెప్పులతో బాధపడుతుండడం, నిద్రలో పక్క తడపడం, ప్రశాంతంగా నిద్రపోలేక పోవడం, విపరీతమైన కోపం, అతి పిరికితనం, యుక్త వయస్సు వస్తున్నప్పటికీ మరీ చిన్న పిల్లల్లా ప్రవర్తించడం వంటి లక్షణాలను గృహహింస బాధిత పిల్లల్లో చూడవచ్చు.
ఇందరి జీవితాలను, సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ భయంకర రోగానికి మందు లేదా అంటే ఈ రోగాన్ని పూర్తిగా మాయం చేయలేమన్న సమాధానమే వస్తుంది. గృహహింస నాలుగు గోడల మధ్య వ్యవహారంగా కాక, సమాజానికి కీడైన అంశమని గుర్తించి న్యాయసంస్థలు, చట్టాలు నేరస్తులను కఠినంగా శిక్షించని రోజున చిన్నవాళ్ళు, బలహీనులు శారీరకంగా, మానసికంగానే కాక అన్ని రకాలుగా హింసించబడుతూనే వుంటారు. అయితే మొత్తం సమాజం ఈ గృహహింసను సహించడానికి ఇకపై సిద్ధంగా లేమని ప్రకటించిన రోజున, అంతగా మార్పు చెందిన రోజున, ప్రపంచంలోని ప్రతి మనిషికి వారి వారి హక్కులుంటాయని ఎదుటివారు గుర్తించిన రోజున రోగం నయమవడం ప్రారంభమవుతుంది. ఆ వెలుగుల కోసం ఎదురు చూద్దాం.

No comments: