ఒక చిట్టి పావురం తన ప్రయాణంలో అలసిపోయి విశ్రాంతి కోసం ఒక చెట్టు కొమ్మను ఎంచుకుంది. పైగా, ఆహారం కూడా అందుబాటులో వుంది. రోజంతా కదలకుండా ఆనందంగా గడచిపోతుంది. జీవితమంటే అదే కాదు. అదే ముగింపు కూడా కాదు కదా ! ఒక రోజు వేటగాడు వచ్చి పక్షులను పట్టుకోవడానికి వల వేశాడు. ప్రమాదాన్ని గ్రహించిన పావురం ఎగిరిపోవాలని ప్రయత్నించింది. అప్పుడు గుర్తించిందా పక్షి... సుఖమైన జీవన విధానానికి అలవాటుపడ్డ తాను ఎగరడమే పరచిపోయానని. విలపిస్తే వల కరుగుతుందా ? వేటగాడు కరుణిస్తాడా ?
ఫెమినిజమంటే అంతులేని సుదీర్ఘ పోరాటమా ? పేజ్-3 పార్టీల్లో రంగు నీళ్ళతో తడుస్తున్న గొంతుకలకు ఒక అందమైన చర్చనీయాంశమా ? లేక ఆర్టీసీ బస్సుల్లో 20 సీట్ల కేటాయింపుతో తృప్తిపడుతున్న ముగింపా ? ఫెమినిజమంటే రంగు చీరల ధగధగల మధ్య నియాన్ లైట్ల వెలుతురులో, నిరంతర వార్తా స్రవంతుల్లో గొంతు చించుకునే ఆవేశమా ?
ఒక బస్సులో లేడీస్ సీట్ మనం చర్చనీయాంశంగా చేసుకుంటే, ఇందులోని సహజమైన విషాదాలు మనకు నవ్వు తెప్పించక మానవు. ఒక మగవాడు లేడీస్ సీట్లో కూర్చుంటే ఆడవారు బస్సు ఎక్కగానే అతడు లేచి నిలబడాలి. ఎందుకంటే అది లేడీస్ సీట్. మరో లేడీస్ సీట్ ఖాళీగా వున్నా ఆ మగవాడు లేవకుండా వుండలేడు. ఎందుకంటే ఆ జనం మధ్య ఫెమినిజం గొంతు విప్పుకుంటుంది. తమ హక్కుల చరిత్రను వినిపిస్తుంది. అదే బస్సులోకి ఓ వికలాంగుడు ఎక్కి నిలబడితే ఏ లేడీస్ సీటు ఖాళీ అవదు. అతనికి సీటు దొరకదు. ఎందుకంటే ఆ వికలాంగుడి హక్కులు ఫెమినిజం చట్రాల మధ్య లేవు కదా!
నేను ఒప్పుకోవలసిన, చెప్పుకోదలచిన వాస్తవాలింకా చాలానే మిగిలి వున్నాయి. అప్పుడే నాపై ఫెమినిజం వ్యతిరేకి అన్న ముద్ర వేయకండి. నిజమే! అప్పుడే పుట్టిన ఓ ఆడ పసిబిడ్డను శత్రువుగా చూసి తమ కరకు హస్తాలతో హత్య చేసిన రోజులను, ఒక్క ఇంట్లో పుట్టిన ఇద్దరు పిల్లలలోని ఒక మగ పిల్లవాడు చదువుకోవడానికి బడికి వెళ్ళిన వేళ, ఆడపిల్ల ఇంట్లో అంట్లు తోమిన రోజులను తలచుకుంటే కన్నీళ్ళ వెచ్చదనం చెంపలకు, ఉప్పదనం పెదాలకు తగులుతుంది. అయినా అది గతమేగా, వర్తమానాన్ని మేము మార్చేశాముగా ! ఆహా క్షణం పాటైనా భ్రమ ఎంత అందంగా వుంది.
ఓ రైలు ప్రయాణంలో పలుకరించిన తోటి ప్రయాణీకుడు చెప్పాడు తనకు ఎనిమిది మంది ఆడపిల్లలని. అదేంటని అడిగితే మగపిల్లాడి కోసం ఎదురు చూస్తున్నానని. నిజమే, సమూహంగా మహిళలు సమానత్వాన్ని సంఖ్యలో సాధించినట్లే వున్నారు. కానీ, అణగదొక్కబడి, నొక్కబడి, పీడించబడుతున్న సమూహంగా మిగిలిపోతున్నారు. మరి దానికి మందేమిటి ? ఖచ్చితంగా ఫెమినిజమే. ఈ శతాబ్దంలో మహిళలు అందిపుచ్చుకున్న బ్రహ్మాస్త్రం ఫెమినిజం. సమాజంలో సమంగా వున్న జీవి సమానత్వపు హక్కుల కోసం ఎక్కుపెట్టిన ఆయుధం, బానిసత్వపు సంకెళ్ళని ఛేధించడానికి పైకెత్తిన పరశువు.
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో, నగరాల్లో ఒక జాతిలో సమ భాగమైన మహిళల పట్ల పెచ్చరిల్లిన హింస, ఆకాశమే హద్దుగా విజృంభించిన పురుషాధిక్యత ఆడ జాతిని అణగదొక్కినప్పుడు బాధితుల వేయి గొంతులు ఒక్కటై నినదించాయి. అలుపులేని పోరాటాలు సాగించాయి. సాధించాయి. నిజం. వారు హక్కులను సాధించారు. ఈ రోజు ప్రపంచంలో ఎక్కడ చూడండి మహిళలకు సమానావకాశాలు. ఆకాశంలో సగం ఆమె. విద్య, ఉద్యోగాలు ఎందులో చూసినా ఆమెతో పోటీ. సామాజిక, ఆర్ధిక అంశాల్లో ఆమె ముందడుగు వేసింది. ఫెమినిజం విజయం సాధించింది. అంతేనా ? అయిపోయిందా ? లేదు. ఇక్కడే అంతా సాధించామన్న భ్రమలో, చెట్టుమీది పావురాయి స్థితిలో ఫెమినిజం పక్కదారి పట్టింది. వల వేసే వేటగాళ్ళను మరచినట్లుంది. ఫెమినిజం ఒక ఆభరణంలా మారింది. తన ప్రాథమికమైన విస్రృత దృక్ఫథాన్ని కోల్పోయింది. విస్రృత స్థాయిలో మహిళల హక్కుల కోసం కాకుండా తమ హక్కులను అనుభవించడానికి, తన హక్కులను సాధించుకోవడానికి మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తుంది. అసహజ న్యాయం నిస్సిగ్గుగా రెక్కలు విప్పుకుని మానవత్వానికి, మహిళలకు వ్యతిరేకంగా విహరిస్తున్న విషయాన్ని ఆధునిక ఫెమినిజం గమనించడంలో విఫలమైంది. ఇక్కడ ఫెమినిజం ముందుచూపు మందగించింది. నా వ్యాఖ్యలు మీకు కోపాన్ని, అసహనాన్ని కలుగజేస్తున్నాయి కదూ ? అంతకు ముందు మీరొక నిజం చెప్పండి. నిజంగా స్ర్తీలు పురుషులతో సమానంగా హక్కులను సాధించారా ? పేజ్-3 మహిళలను పక్కనపెట్టి, ఒక సామాన్య మహిళ లేదా గృహిణి ఏ హక్కుల గురించి తెలుసుకుందో చెప్పండి. ఒక సామాన్య పురుషుడికి మీరు సాధించిన విజయాల గురించి, తన బాధ్యతల గురించి ఎంతవరకు తెలుసో, ఎంతవరకు తెలుసుకున్నాడో చెప్పండి. లేదు. అతను ఖచ్చితంగా తెలిసినట్టు నటిస్తున్నాడు. నిజంగా అతను మీ హక్కులు గుర్తించిన రోజు అతను తన పురుషాధిక్యతను చంపుకోవలసి వస్తుంది. తన క్షహా లోకపు నీడల వేటను నిలిపివేయాల్సి వస్తుంది. అందుకే అతడు నటిస్తున్నాడు. ఆ గొడవ మనకెందుకు అంటున్నాడు. ఇక్కడే ఫెమినిజం ముందు చూపు కోల్పోయిందని నేను ఆరోపిస్తున్నాను. అతని నిర్లిప్తతను తన విజయంగా భావించి మహిళ ఆదమరచింది.
ఈ భూమి మీద పుట్టిన స్ర్తీ పురుషులు ఇరువురూ సమానమే. ఇరువురి హక్కులూ సమానమే అని చాటి చెప్పడమే ఫెమినిజం నిర్దేశిత లక్ష్యమైతే ఆ మూలంలోనే తప్పుందని భావించాలి. ఎందుకు ? మీ ఇంట్లో పుట్టి పెరిగిన ఆడపిల్లను మీరెంత చక్కగా రక్షిస్తారో చెప్పండి. ఓ రాజకుమారిలా పెంచండి. చుట్టూ వున్న సమాజం తనను చక్కటి పువ్వులా ఎలా చూసుకుంటుందో చెప్పండి. కానీ మీరలా చేయడం లేదు. చేయరు. పుట్టుక నుంచి తనకు సమాజంలోని అసమానతల గురించి బోధిస్తారు. పురుషాధిక్య సమాజంలో ఎలా ఒదిగి వుండాలో నేర్పిస్తారు. అనేక నిర్భంధాలను ఎదుర్కొన్న మీరు మీ ఆడపిల్లను ఆ నిర్భంధాలకు లోబడి ఎలా బ్రతకాలో నేర్పుతారు. ఫలితం, ఏదో ఒకరోజు ఓ మగాడు తన పురుషాధిక్యతను నిర్లజ్జగా ప్రదర్శించినప్పుడు దానిని ఎదుర్కొనే కనీస జ్ఞానం, తెలివితేటలు ఆడపిల్లకు లేకుండా పోతున్నాయి. సమన్యాయం, నిషా్పక్షికత, అవగాహనలతో పాటుగా సమానత్వం అంటే ఏమిటన్న దానిపై విస్రృత కోణ దృష్టి వుండాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఎందుకంటే మనం మనుషులను దేశాల ఆధారంగా, భాషల ఆధారంగా, రంగు ఆధారంగా విడగొట్టడాన్ని ఆపగలం. కానీ, ప్రకృతి మనకోసం అభివృద్ది చేసిన రెండు అంగాల మధ్య వున్న తేడాను తుడిచి పెట్టలేము. స్ర్తీ పురుషుల మధ్య ఆ తేడానే లేకపోతే ఈ భూమి మీద జీవితం ఎంతో నిస్సారంగా వుండేది. అన్ని హదు్దలను చెరిపేయగలిగినా ఈ సరిహద్దును మాత్రం మనం చెరపలేదు. ఆ తేడాలే లేకపోతే అసలీ లింగ వివక్ష, అహంకారాలు ఈ భూమి మీద వుండవు.
స్వేచ్ఛాయుతమైన, సమానత్వపు పోరాటాన్ని నిర్వహించే వారి (ఫెమినిస్టు) తెలివి తేటలను కానీ, వారి ఉద్దేశాలను కానీ నేను ప్రశ్నించదలుచుకోలేదు. అలాగే వారు ఈ రోజు వరకు హక్కుల పోరాటాన్ని నడిపిన తీరును అభినందించలేక పోతున్నాను. స్ర్తీ పురుషులు ఒక్కటే అనే భ్రమలో జీవిస్తున్నట్టయితే ఇకనైనా మేలుకోండి. మీరు ఒక్కటి కాలేదు. కాలేరు. వారు మిమ్మల్ని వేరు చేశారు. బస్సుల్లో సీట్ల మధ్య హద్దులు ఏర్పరిచారు. తాళ్ళను కట్టారు. ఇకనైనా అన్నీ సాధించామన్న కలలను వదలి వాస్తవాలను స్వీకరించండి. మీరు ఎక్కడికి నెట్టబడుతున్నారో గ్రహించండి. స్ర్తీ పురుషులు ఒక్కటి కాలేరన్న వాస్తవాన్ని గ్రహించండి. మీకు కావలసింది బస్సులో విభజన రేఖలు కాదు. మీకు కావలసింది మిమ్మల్ని ఒకరు ప్రత్యేకంగా గుర్తించడం కాదు, మిమ్మల్ని వేరుగా చూడడం కాదు. మీకు కావలసింది మీరు సమాజంలో ఒకరుగా కలసిపోవడం. దానికోసం కొత్త గొంతులకు ఊపిరులు పోయండి. కొత్త ఆలోచనలకు రూపమివ్వండి. కొత్త శక్తితో ఉద్యమించండి. అంతే కాదు సుఖమయమైన జీవితాన్ని అందించి మీ రెక్కలను పనికి రాకుండా చేసే చెట్టు కొమ్మలు మీకవసరం లేదని గ్రహించండి.


No comments:
Post a Comment